నామినేషన్ల వేళ ఉద్రిక్తత: గాల్లోకి కాల్పులు!

కలం, వెబ్ డెస్క్​ : కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పరిధిలోని నందలూరులో స్థానిక సంస్థల (MPTC) ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఉద్రిక్తత (Nandalur Clash)కు దారితీసింది. నందలూరులో తమ వర్గం అభ్యర్థులే నామినేషన్ దాఖలు చేయాలంటూ రెండు వర్గాలు పట్టుబట్టడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం వర్గానికి, ఎద్దుల విజయసాగర్, మేడా విజయశేఖర్ రెడ్డి వర్గానికి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణగా మారింది.

నామినేషన్ కేంద్రం సమీపంలో ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ రాళ్లదాడిలో పలువురు గాయపడ్డారు. గొడవ పెరిగి వాతావరణం మరింత రణరంగంగా మారడంతో, తిరుపతికి చెందిన ఎలైట్ ఆసుపత్రి ఛైర్మన్, టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం గాలిలోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.

ఈ ఘర్షణలో రెచ్చిపోయిన కొందరు వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఒక కారును పూర్తిగా ధ్వంసం చేయగా, మరొక కారుకు నిప్పుపెట్టారు. వీటితో పాటు రెండు ద్విచక్రవాహనాలను కూడా తగలబెట్టారు. స్థానికంగా భయాందోళనలు నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నందలూరు ప్రాంతంలో మరింత ఘర్షణలు చోటుచేసుకోకుండా భారీగా పోలీస్ బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>