కలం, ఖమ్మం బ్యూరో : రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వను పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామ పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్టను సోమవారం ఆయన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుమ్ముగూడెం ఆనకట్ట పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 0.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 0.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని తెలిపారు. ఆనకట్ట వద్ద సుమారు ఒక మీటరు ఎత్తు వరకు ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి, ఒక టీఎంసీ కంటే ఎక్కువ నీటిని నిల్వ చేసే అవకాశాలను పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. విజయదశమి పండుగ రోజైనా పనులకు ఆటంకం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు, ముఖ్యంగా సూపర్ ఎల్నినో ప్రభావంతో రానున్న వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని మంత్రి (Minister Tummala Nageswara Rao) తెలిపారు. దీనివల్ల విద్యుత్ డిమాండ్ పెరిగే ప్రమాదం ఉన్నందున, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందస్తుగా నీటి వనరుల నిర్వహణపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి మూడు జిల్లాలకు తాగునీరు అందించాల్సి ఉన్నందున, తాగునీటి సరఫరాకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ప్రైవేటు జలవిద్యుత్ కేంద్రాలు కూడా తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకునేలా సమన్వయంతో వ్యవహరించాలని తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతున్న నేపథ్యంలో, ఈ నెలలో అనుమతులు రాగానే నవంబర్ నుంచి సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించేలా అధికారులు, నిర్మాణ సంస్థ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఇక వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను అంచనా వేసుకుని రైతులు తక్కువ కాలంలో దిగుబడి వచ్చే కూరగాయలు, పప్పుదినుసులు వంటి పంటలను సాగు చేయాలని కోరారు. అధిక పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోకుండా వ్యవసాయ అధికారులు తగిన అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు సైతం తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, నీటిపారుదల శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

