కలం, పెద్దపల్లి: మంథని నియోజకవర్గంలో నవంబర్ 1 నుంచి మహిళలకు ఉచిత శిక్షణ అందించి డిసెంబర్ నాటికి గార్మెంట్ ఫ్యాక్టరీ(Garment Factory) ద్వారా 300 నుంచి 400 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తామని.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) వెల్లడించారు. మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అలీఫ్, డీఆర్డీఏ, మెప్మా, సీఎస్ఆర్ భాగస్వామ్యంతో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 600 మంది లబ్ధిదారులకు మంత్రి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అలాగే 302 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.కోటి విలువైన చెక్కులను అందజేశారు. ఇప్పటివరకు నియోజకవర్గవ్యాప్తంగా 3,040 మంది మహిళలకు కుట్టు మిషన్లపై శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. జనవరి నుంచి పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తామని, ఆసక్తి ఉన్న మహిళా సంఘాల సభ్యులకు ములుగునూరు డైరీలో 15 రోజుల పాటు శిక్షణ ఇప్పిస్తామని వెల్లడించారు. నియోజకవర్గంలో రూ.8.40 కోట్లతో 84 విలేజ్ ఆర్గనైజేషన్ (వీవో) భవనాలు, రూ.5.16 కోట్లతో 43 నూతన అంగన్వాడీ భవనాలను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ నీరు, విద్యుత్ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం సకాలంలో ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించి పంటలను కాపాడిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

