కలం, వెబ్ డెస్క్: దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో శాశ్వత అధికారం కోసం కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. దేశం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఒక్క చుక్క రక్తమైనా ధారపోశారా? అని నిలదీశారు. కులం, మతం పేరుతో ఓటర్ లిస్ట్ నుంచి ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామ్యం లేని బీజేపీ.. నేడు దేశభక్తి గురించి పాఠాలు చెబుతోందని మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి మహనీయుల చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్వాతంత్రోద్యమ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్రను యువత తెలుసుకోవాలని కోరారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.

