కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 60 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కరవైందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. “ఓట్లు మావి.. సీట్లు మీవా?” అంటూ రాజకీయ పార్టీలను నిలదీసింది. గురువారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పొదిల సతీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి యలమందల జగదీష్‌లు విలేకరుల సమావేశం నిర్వహించారు.
గత 26 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్‌యూఐ విద్యార్థి సంఘం నాయకుడిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ అభివృద్ధికి శ్రమించిన డాక్టర్ లోకేష్ యాదవ్, నాయి బ్రాహ్మణ బిడ్డ జంపాల రాజేష్‌లకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014, 2018, 2023 ఎన్నికలలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ, మంత్రి పదవులలో ఒక్క బీసీకి కూడా అవకాశం దక్కలేదని వారు మండిపడ్డారు.
రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో నాయి బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో బీసీలకు సత్వరమే న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున బీసీల ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బత్తుల వీరబాబు, పగడాల హనుమంతరావు, రాగం కోటి, నాగరాజు, వినయ్, వంశి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

