కలం, తెలంగాణ బ్యూరో: కరువు వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించినా ముందస్తు చర్యలు చేపట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) విమర్శించారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వడంతో పాటు వారి కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కరువు విషయంలో ఏమీ చేయలేనని సీఎం చేతులెత్తేశారని మండిపడ్డారు. పాలకుడికి దూరదృష్టి ఉండాలని, కానీ సీఎంలో అది లోపించిందన్నారు.
పరిస్థితి చేయి దాటి పోయిన తర్వాత వచ్చి రైతులు త్యాగాలు చేయాలని మాట్లాడటం దారుణమన్నారు. ‘‘ఆగస్టులో 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అప్పుడే అలర్ట్ అయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. పక్క రాష్ట్రాలు కరువు మండలాలను ప్రకటించి కేంద్రానికే ఇప్పటికే నివేదికలు పంపాయి. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు చేసుకోవడానికి ఇదే సరైన సమయం. వచ్చే వర్షాకాలంలోగా పనులు పూర్తి చేసి గోదావరి నీళ్లను వినియోగంలోకి తేవాలి. ఇంకా ఎన్నాళ్లు గత ప్రభుత్వాన్ని తిడుతూ టైమ్ వేస్ట్ చేస్తారు. తిట్టుడు బంద్ చేసి.. కట్టుడు షురూ చేయండి” అని అన్నారు.

