కలం, కరీంనగర్: రేవంత్ ప్రభుత్వం రైతాంగం పట్ల తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు (Sunil Rao) మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దు నిద్రను మట్టుబెట్టేందుకే ఈనెల 23న కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. తిమ్మాపూర్ అధ్యకులు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం కు సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
చేతికి వచ్చిన పంట సాగునీరు లేక కళ్ల ముందే ఎండిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని సునీల్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం బావుల కింద ఉన్న నీళ్లతోనైనా పంటలను కాపాడుకుందామని రైతులు తాపత్రయపడుతుంటే, అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను తీవ్ర గోస పెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతాంగానికి చిన్నచూపే దక్కిందని దుయ్యబట్టారు.
పంటలను, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సునీల్ రావు విమర్శించారు. నిద్రమత్తులో ఉన్న ఈ ప్రభుత్వానికి కన్నువిప్పు కలిగించేందుకే బీజేపీ ఆధ్వర్యంలో 23న ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టామని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహించే ఈ పోరాటంలో రైతాంగం, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.

