కలం, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం జిల్లాలోని చిగురుమామిడి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్లోని ఎఫ్ఐఆర్ కాపీలు, పెండింగ్ కేసులు, రౌడీ షీటర్ల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్ కౌంటర్, లాకప్ రూమ్లను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా విని వారికి త్వరితగతిన న్యాయం చేకూర్చాలని సిబ్బందిని ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం వహించరాదని, గ్రామాల్లో నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) అనిల్, చిగురుమామిడి సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) జగదీశ్వర్తోపాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

