లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్‌ రిజ్వాన్

కలం, జోగులాంబ‌ గద్వాల: జిల్లాలోని గ్రామాల భూముల రీసర్వే ప్రక్రియను కచ్చితత్వంతో, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ (Collector Rizwanbasha Shaik) సర్వే అధికారులను ఆదేశించారు. శుక్రవారం గద్వాల మండలం సంగాల గ్రామపంచాయతీకి సంబంధించిన రీసర్వే పనుల పురోగతిని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రీసర్వేలో భాగంగా ముందుగా గ్రామ సరిహద్దులను కచ్చితంగా గుర్తించి డీమార్కేషన్‌ చేయాలని సూచించారు. సరిహద్దుల నిర్ధారణకు అందుబాటులో ఉన్న పాత రికార్డులతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలని తెలిపారు. అనంతరం సర్వే నంబర్ల వారీగా భూములను గుర్తించి పార్సిళ్లుగా రూపొందించాలన్నారు. ప్రభుత్వ భూములు, రహదారులు, గ్రామకంఠం, అసైన్డ్‌ భూములు, చెరువులు, కుంటలు, గట్లు, తదితరాలను ప్రత్యేకంగా గుర్తించి రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. సంబంధిత రెవెన్యూ రికార్డులను ఆధారంగా తీసుకుని క్షేత్రస్థాయిలో భౌతిక పరిస్థితులతో సరిపోల్చాలని సూచించారు.

రీసర్వేలో రోవర్‌, జీపీఎస్‌, తదితర సాంకేతిక పరికరాలను సక్రమంగా వినియోగించాలని తెలిపారు. సర్వే సమయంలో ప్రతి పాయింట్‌కు సంబంధించిన భౌగోళిక వివరాలు కచ్చితంగా నమోదు అయ్యేలా చూడాలన్నారు. పాయింట్లను నమోదు చేసే సమయంలో అవసరమైన సమయం తీసుకుని సిగ్నల్‌ స్థిరంగా వచ్చిన తర్వాతే తుది పాయింట్‌ను నిర్ధారించాలన్నారు. గ్రామంలో ప్రైవేట్ భూముల సర్వే చేపట్టే తేదీని ముందుగానే సంబంధిత రైతులకు తెలియజేయాలని సూచించారు. సంబంధిత రైతులు తమ పొలాల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల సహకారంతో సర్వే పనులను వేగంగా, వివాదాలకు తావులేకుండా పూర్తి చేయవచ్చన్నారు. రికార్డుల్లో ఉన్న వ్యక్తి, క్షేత్రస్థాయిలో భూమిని అనుభవిస్తున్న వ్యక్తి వేర్వేరుగా ఉన్న సందర్భాల్లో నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. వారికి తమ ఆధారాలు, అభ్యంతరాలు సమర్పించేందుకు అవకాశం కల్పించి, నిర్ణీత గడువులోగా వాటిని పరిశీలించాలని తెలిపారు.

జిల్లాలో ఇప్పటికే జీపీఎస్‌, సర్వే తదితర అంశాల్లో శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లు అందుబాటులో ఉన్నందున వారిని రీసర్వే పనుల్లో సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కేటాయించిన సిబ్బంది పనిలో పూర్తిస్థాయిలో పాల్గొనేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ పర్యటనలో సర్వే ఏడీ నూకరాజు, తహసీల్దార్ హరికృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ అజిత్, ఆర్ఐ వెంకటేశ్వర్ రెడ్డి, మండల సర్వేయర్ సందీప్, పలువురు గ్రామస్తులు, తదితరులున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>