కలం, జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకుంటూ రైతుల సంక్షేమానికి, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. ప్రాణహిత నది నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని వినియోగించుకునేందుకు కాపర్ డ్యాంలు నిర్మించి, నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని సూచించారు. రూ.200 నుంచి రూ.300 కోట్ల పెట్టుబడితో 100 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించి, సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ (Jabithapur) గ్రామంలో నిర్వహించిన ‘ఊరూరా జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమంలో భాగంగా తన వ్యవసాయ క్షేత్రంలో జీవన్ రెడ్డి జమ్మి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మి చెట్టు విజయానికి చిహ్నమని, బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.
రైతులను రెండో పంట సాగుకు ప్రోత్సహించాలి
ప్రస్తుతం ప్రాణహిత నది నుంచి వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్న నేపథ్యంలో, అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని జీవన్ రెడ్డి కోరారు. మేడిగడ్డ బ్యారేజీపై ఆధారపడకుండా కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తిపోసే అవకాశాలను పరిశీలించాలని.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వినియోగించుకునే మార్గాలపైనా దృష్టి సారించాలని సూచించారు.
రబీ పంటలు సాగు చేయవద్దని రైతులకు చెప్పడం కంటే అవసరమైన నీరు, విద్యుత్ అందించి రెండో పంటతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలని అన్నారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సాగునీరు అందుబాటులో ఉంటే వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి రాంచంద్ర రెడ్డి, తాటిపర్తి సీకే రెడ్డి, ఆరావ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పోనిశెట్టి మహేష్, ఉపసర్పంచ్ లక్ష్మణ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కమిటీ సభ్యులు, దుర్గయ్య, హన్మంత్ రావు, రాజిరెడ్డి, విజయ్, రవీందర్, సతీష్, నర్సయ్య, జలందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

