కలం, స్పోర్ట్స్ : ప్రపంచ రెజ్లింగ్ వేదికపై భారత యువ రెజ్లర్ విశ్వజిత్ రామచంద్ర మోరే (Vishwajit Ramchandra More) చరిత్ర సృష్టించాడు. అండర్-23 ప్రపంచ ఛాంపియన్షిప్లో రజత పతకం (Silver Medal) సాధించాడు. అమెరికాలోని లాస్ వెగాస్లో జరిగిన పురుషుల 55 కిలోల గ్రెకో-రోమన్ విభాగం ఫైనల్లో స్వర్ణానికి చేరువగా వచ్చి ఓడిపోయాడు. జార్జియా రెజ్లర్ కోబా కరుమిడ్జేతో హోరాహోరీగా తలపడి 12-13 తేడాతో పరాజయం పాలయ్యాడు. అయినా, ఈ విభాగంలో అండర్-23 ప్రపంచ ఛాంపియన్షిప్ చరిత్రలో రజతం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
ఫైనల్కు చేరే క్రమంలో విశ్వజిత్ మూడు కీలక విజయాలు సాధించాడు. మొదట మెక్సికోకు చెందిన ఐజాక్ మారిన్ మాటాను 10-8తో ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో ఇరాన్కు చెందిన అర్మిన్ షంషిపూర్పై 8-1తో గెలిచాడు. ఆ తర్వాత సెమీఫైనల్లో రష్యా రెజ్లర్ మాలిక్ గిగియేవ్ను 6-4తో ఓడించి తుది పోరుకు అర్హత సాధించాడు. గతంలో ఇదే పోటీల్లో విశ్వజిత్ రెండు కాంస్య పతకాలు గెలిచాడు. ఇప్పుడు రజతం సాధించి మరో ఘనత అందుకున్నాడు. అండర్-23 ప్రపంచ ఛాంపియన్షిప్లో గ్రెకో-రోమన్ విభాగం ఫైనల్కు చేరిన తొలి భారతీయుడిగానూ నిలిచాడు. ఈసారి స్వర్ణం సాధించాలన్న లక్ష్యం తృటిలో చేజారింది.
మరోవైపు, ఈ పోటీల్లో భారత రెజ్లింగ్ జట్టుకు వీసాల సమస్య ఎదురైంది. గ్రెకో-రోమన్, మహిళల విభాగాలకు చెందిన తొమ్మిది మంది రెజ్లర్లకు అమెరికా వీసాలు నిరాకరించింది. వారు 20 ఏళ్లలోపు వయసులో ఉండటం, పూర్తిస్థాయి ఉద్యోగాలు లేకపోవడం వీసా తిరస్కరణకు కారణాలుగా పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వీసాల నిరాకరణతో భారత్ పతక అవకాశాలు దెబ్బతిన్నాయని తెలిపాడు. వీసాలు తిరస్కరించిన వారిలో కనీసం ఇద్దరు స్వర్ణం సాధించే అవకాశాలున్న రెజ్లర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నాడు.

