కలం, స్పోర్ట్స్: భారత్-వెస్టిండీస్ మధ్య హోరాహోరీగా సాగుతున్న టీ20 సిరీస్లో చివరి పోరుకు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐదో టీ20 (Ind vs WI 5th T20I ) జరగనుంది. అయితే నగరంలో కురుస్తున్న వర్షాలు, నీరు నిలిచే పరిస్థితులు మ్యాచ్పై ఆందోళన పెంచుతున్నాయి. వాతావరణ అంచనాల ప్రకారం శనివారం బెంగళూరులో వర్షం పడే అవకాశం 90 శాతంగా ఉంది. మధ్యాహ్నం నుంచి వర్ష సూచన క్రమంగా పెరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు 11 శాతంగా ఉన్న వర్ష అవకాశం, సాయంత్రం 3 గంటలకు 40 శాతానికి చేరనుంది. సాయంత్రం 4, 5 గంటల సమయంలో ఇది 68, 71 శాతంగా ఉండనుంది.
సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ సమయంలో వర్ష సూచన 64 శాతంగా ఉంది. రాత్రి 8, 9 గంటలకు 49 శాతంగా, 10 గంటలకు 56 శాతంగా వర్ష అవకాశం ఉంటుందని అంచనా. మరోవైపు, ఈ సిరీస్లో ఇప్పటికే భారీ స్కోర్లు నమోదయ్యాయి. తొలి టీ20లో భారత్ 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రెండో మ్యాచ్లో వెస్టిండీస్ 250 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. మూడో మ్యాచ్లో భారత్ 223 పరుగులను కాపాడుకుని 14 పరుగులతో గెలిచింది.
నాలుగో టీ20లో 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 2-2తో సమంగా ఉంది. చివరి మ్యాచ్ (Ind vs WI 5th T20I) లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కుతుంది. బెంగళూరు పిచ్పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నా, వర్షం సహకరించకపోతే ఆటకు అంతరాయం కలగవచ్చు. వాతావరణం ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

