కలం, కరీంనగర్: విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం (Somaram) గ్రామ శివారులో వ్యవసాయ బావి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో మెరుపు దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పేలుడు పదార్థాలు (Illegal Explosives) కలిగి ఉన్నట్లు గుర్తించారు. రామడుగు మండలం శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన వేముల భూమయ్య (45)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి సుమారు 475 జిలెటిన్ స్టిక్స్, 3,000 మీటర్ల డిటోనేటింగ్ వైర్ (3 బండిళ్లు)తో పాటు రెండు కంప్రెసర్ ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, కంప్రెసర్ ట్రాక్టర్లు, నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సైదాపూర్ పోలీసులకు అప్పగించడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

