కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి విరుచుకుపడింది. ఆన్లైన్ బెట్టింగ్, యాప్ ద్వారా జరిగిన భారీ ఆర్థిక మోసాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 15 వేర్వేరు ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్రలోని పుణెలో నమోదైన ఒక ప్రధాన కేసు విచారణలో భాగంగా ఈ సోదాలు (ED Raids) కొనసాగుతున్నాయి.
సైబర్ మోసాలు, అక్రమ బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, ఆ నిధులను ఇతర ఖాతాలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన హవాలా మూలాలు, బ్యాంక్ లావాదేవీలు, డిజిటల్ ఆధారాలను సేకరించేందుకు ఈడీ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. సోదాల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

