దళితుల ఆత్మగౌరవంపై రాజకీయాలా?.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఫైర్!

కలం, వనపర్తి: మంగంపల్లి ఆలయ ప్రవేశ ఘటన (Mangampalli Temple Entry Incident) ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రాజకుమార్‌ బీఆర్‌ఎస్‌ నాయకులకు సూచించారు. దళితుల సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగిన ఘటనలపై ఎందుకు స్పందించలేదో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మంగంపల్లి ఘటనను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. సోమవారం వనపర్తిలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజకుమార్‌తో పాటు కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంకిని వెంకటేష్‌, పార్టీ సీనియర్‌ నాయకుడు మహేష్‌, పెద్దమందడి మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, జిల్లా అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్‌ తదితరులు మాట్లాడారు.

నేరెళ్ల ఘటనపై ఏం సమాధానం చెబుతారు?

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నేరెళ్లలో ఇసుక టిప్పర్ల వ్యవహారానికి సంబంధించి దళితులపై దాడులు జరిగినప్పుడు నాయకులు ఎందుకు స్పందించలేదని రాజకుమార్‌ ప్రశ్నించారు. అప్పట్లో దళితుల సమస్యలపై స్పందించని వారు ఇప్పుడు మంగంపల్లి ఘటనను రాజకీయంగా ప్రస్తావించడం సరికాదని విమర్శించారు.

దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలపై అన్ని సందర్భాల్లో ఒకే వైఖరితో వ్యవహరించాలని అన్నారు. శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్‌ నాయకులు చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యల విషయంలోనూ దళితుల గౌరవంపై మాట్లాడేవారు తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు.

గత ప్రభుత్వ హయాంలో దళితులకు కల్పించిన ప్రయోజనాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై నిరంజన్‌రెడ్డి ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. మంగంపల్లి ఘటనపై సమాచారం అందిన వెంటనే ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు ఫోన్‌ చేసి, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారని రాజకుమార్‌ తెలిపారు.

తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నది ఎమ్మెల్యే వైఖరి అని పేర్కొన్నారు. గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయానికి దళిత సామాజిక వర్గానికి చెందిన నాగన్న ప్రధాన అర్చకుడిగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఘటనకు సంబంధించి సుధీర్‌ ఇచ్చిన వాంగ్మూలంలో, మీడియా ముందు వెల్లడించిన వివరాల్లో కులదూషణ అంశాలు ప్రస్తావించలేదని రాజకుమార్‌ పేర్కొన్నారు. అయితే, ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై విచారణ ద్వారా వాస్తవాలు వెల్లడికావాల్సి ఉందన్నారు. వాస్తవాలను పరిశీలించకుండా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం తగదని అన్నారు.

దళితుల సంక్షేమంపై లెక్కలు చెప్పాలి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దళితులకు జరిగిన అన్యాయాలపై ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని రాజకుమార్‌ డిమాండ్‌ చేశారు. తమ హయాంలో 132 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని పేర్కొంటూ, దళితుల సమస్యలపై మాట్లాడే నాయకులు గత పరిణామాలపైనా స్పందించాలని అన్నారు. మెంటపల్లి గ్రామపంచాయతీలో జనరల్‌ స్థానంలో దళిత అభ్యర్థిని నిలబెట్టి గెలిపించిన ఘనత ఎమ్మెల్యే మేఘారెడ్డిదేనని పేర్కొన్నారు. కులాలకు అతీతంగా నాయకత్వానికి అవకాశాలు కల్పించాలన్నది కాంగ్రెస్‌ పార్టీ వైఖరి అని తెలిపారు.

లెటర్‌ ప్యాడ్‌ వినియోగంపై ఫిర్యాదు చేస్తాం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో జరుగుతున్న జాప్యంపై జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ వ్యవహారాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారని రాజకుమార్‌ ఆరోపించారు. మాజీ మంత్రి హోదాలోని లెటర్‌ ప్యాడ్‌ వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, ఈ వ్యవహారాన్ని డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దళితులను అవమానించేలా వ్యవహరించినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు గంధం రాజశేఖర్‌, పట్టణ అధ్యక్షుడు కదిరే రాములు, వివిధ మండలాల ఎస్సీ సెల్‌ అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>