కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam)లోని తెలంగాణ టూరిజం హాల్లో ఉమ్మడి నల్గొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగాలని ఈ సమావేశం (Congress Meeting)లో పిలుపునిచ్చారు.
ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు రాంసహాయం రఘురాం రెడ్డి, పోరిక బలరాం నాయక్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, ఎమ్మెల్సీ భద్రాచలం ఎన్నికల ఇన్చార్జ్ కేతావత్ శంకర్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటి దేవి ప్రసన్నతో పాటు పలువురు ప్రముఖ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, నియోజకవర్గంలోని పట్టభద్రులందరినీ సమన్వయం చేస్తూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. విద్యావంతుల ఆకాంక్షలను శాసనమండలిలో బలంగా వినిపించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులంతా తనకు మద్దతుగా నిలిచి ఎన్నికల్లో ఘనవిజయం సాధించేలా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్నికల కార్యాచరణ, ఓటర్లను కలవడం, ప్రచార వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.

