420 హామీలపై 420 అడుగుల ఫ్లెక్సీ: మాజీ ఎమ్మెల్యే  

కలం, నిజామాబాద్ బ్యూరో: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందని.. వాటిని 1000 రోజులైనా అమలు చేయలేదని నిజామాబాద్ (BRS Nizamabad)లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. 420 హామీలతో కూడిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రజల ముందు ప్రదర్శించారు. కాంగ్రెస్ స్కీములు, నిధుల వివరాలతో కూడిన బాకీ కార్డులను 26వ డివిజన్ కోటగల్లిలో ఇంటింటికీ పంపిణీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయని, ఎన్నికల హామీలను గాలికొదిలేసి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలను నిలువునా మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్..

అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు 1000 రోజులైనా అమలుకు నోచుకోలేదని గణేష్ గుప్తా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కొత్తగా ఏర్పడిన ఏ ప్రభుత్వానికైనా పనిచేసేందుకు కొంత సమయం ఇవ్వాలనే సదుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇన్నాళ్లూ వేచి చూశారని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రజలను నిరంతరం మోసం చేస్తుండటంతో ఇక చూస్తూ ఊరుకోబోమని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారని తెలిపారు.

హామీలు అమలు చేయాలి..

సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి, ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇస్తామని ఎగనామం పెట్టిన సంక్షేమ పథకాలు, లబ్ధిదారులకు రావాల్సిన డబ్బుల వివరాలను ‘బాకీ కార్డు’ రూపంలో రూపొందించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సిర్ప రాజు ఆధ్వర్యంలో 26వ డివిజన్ పరిధిలోని కోటగల్లి ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి ఈ బాకీ కార్డులను పంపిణీ చేసి, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డి, అబ్దుల్ మతీన్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, డివిజన్ ఇంచార్జూలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>