కలం, ఖమ్మం బ్యూరో: జై శ్రీరామ్ నామస్మరణతో ప్రసిద్ధ దివ్యక్షేత్రమైన భద్రాచలం (Bhadrachalam) దివ్యధామం మార్మోగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చారిత్రక శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా సాగిన శరన్నవరాత్రోత్సవాలు విజయదశమి పర్వదినాన అత్యంత నేత్రపర్వంగా ముగిశాయి. దసరా పండుగను పురస్కరించుకుని బుధవారం ఆలయంలో నిర్వహించిన మహా పూర్ణాహుతి, శ్రీరామ పట్టాభిషేకం మరియు ప్రత్యేక వేదికపై ఏర్పాటైన ‘రామలీలా’ ఉత్సవాలు భక్తులకు అనిర్వచనీయమైన దివ్యానుభూతిని పంచాయి.
శరన్నవరాత్రులలో భాగంగా గత తొమ్మిది రోజుల పాటు భద్రాద్రి క్షేత్రం అంతటా ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లింది. వందలాది మంది భక్తుల సమక్షంలో 24 వేల శ్లోకాల మూల రామాయణ సారాంశంతో అత్యంత భక్తిశ్రద్ధలతో చేపట్టిన ‘సంక్షేప రామాయణ హవనం’ ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగింది. విజయదశమి నాడు ఈ మహా యజ్ఞం పూర్ణాహుతితో పరిపూర్ణం కావడంతో భక్తలోకం పరవశించిపోయింది.
అనంతరం లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీరామచంద్రమూర్తికి ‘రాజ్య పట్టాభిషేకః’ ఘనంగా నిర్వహించి, సర్వలోక రక్షకుడిని భక్తులకు కన్నులపండువగా దర్శింపజేశారు. మరోవైపు ఆలయ అభివృద్ధి నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతుండటం, ముఖ్యంగా పశ్చిమ రాజగోపురం నుండి దిగువకు వెళ్లే మార్గంలో పిల్లర్ల నిర్మాణం ఎత్తుపల్లాలు ఉండటంతో… స్వామి వారిని తిరువీధి సేవకు సురక్షితంగా తీసుకెళ్లేందుకు తగిన ఏర్పాట్లు లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైదిక సిబ్బంది సూచనల మేరకు దేవస్థానం ఈ ఏడాది రామలీలా వేడుకల వేదికలో తగిన మార్పులు చేసింది.
దీంతో ఉదయం వేళ కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం వేళ జమ్మి కొమ్మను భక్తిశ్రద్ధలతో ఆలయానికి తీసుకువచ్చి, నిర్ణీత విజయముహూర్తంలో శ్రీస్వామి వారికి శమీ పూజతో కూడిన విజయోత్సవాన్ని అంతరంగికంగా జరిపారు. ఆ వెంటనే స్వామివారి ప్రతినిధిగా పాదుకలను, దివ్య రామజ్యోతిని వేదఘోష, మంగళవాయద్యాలు, కోలాటాల కోలాహలం నడుమ సాంప్రదాయబద్ధంగా జమ్మి మండపానికి తీసుకువెళ్లారు.
సరిగ్గా సాయంత్రం 06:00 గంటలకు ఇక్కడ “రామలీలా” ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష్మీదేవి అంతర్వాహినిగా భావించే శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు, ఆయుధ పూజలు ఘనంగా చేపట్టారు. భద్రాచలానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, పట్టాభిషేక మహోత్సవంలో పాలుపంచుకుని తరించారు. ఈ పవిత్ర వేడుకల్లో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీరామచంద్రుని కృపాకటాక్షాలకు పాత్రులు అయ్యారని దేవస్థాన కార్యనిర్వహణాధికారి మరియు అర్చక స్వాములు తెలిపారు.

