కలం, ఆదిలాబాద్: గిరిజన సంక్షేమం, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పీఎం జన్-మన్’, ‘ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ పథకాల పురోగతిపై గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పిఓ మంద మకరంద్తో కలిసి ఆయన వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుదూర మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు, ముఖ్యంగా అత్యంత వెనుకబడిన పీవీటీజీ తెగల కుటుంబాలకు ప్రభుత్వ ఫలాలు పూర్తిగా అందాలనేదే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమన్నారు.
గిరిజన పల్లెలు, తండాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గిరిజన ఆవాసానికి రోడ్లు, సురక్షిత తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, నూతన అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ రవీందర్ రాథోడ్, హౌసింగ్ పీడీ శంకర్, డీఎంహెచ్వో సాధన, పంచాయతీ అధికారి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

