కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్లో సంయుక్త వినియోగ విమానాశ్రయ (Adilabad Airport) ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విమానాశ్రయం కోసం మొత్తం 2,009.23 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 2,004.31 ఎకరాలకు సంబంధించి నోటిఫైడ్ పీఎన్ జారీ చేసినట్లు వెల్లడించారు. అర్లి-బి గ్రామంలో 160.32 ఎకరాలు, కచ్కంటి గ్రామంలో 29.19 ఎకరాలు, టాక్లి గ్రామంలో 5.20 ఎకరాలు, అనుకుంట గ్రామంలో 878.13 ఎకరాలకు పూర్తిస్థాయిలో నోటిఫైడ్ పీఎన్ జారీ చేశారు. నిషాన్ఘాట్ గ్రామంలో ప్రతిపాదిత 430.09 ఎకరాలకు గాను 428.16 ఎకరాలకు, ఖానాపూర్లో 288.14 ఎకరాలకు గాను 288.13 ఎకరాలకు నోటిఫైడ్ పీఎన్ జారీ చేశారు.
ఆదిలాబాద్ గ్రామంలో 216.36 ఎకరాలకు గాను 213.38 ఎకరాలకు సంబంధించి ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మొత్తం ప్రతిపాదిత భూమిలో దాదాపు పూర్తి విస్తీర్ణానికి సంబంధించి నోటిఫైడ్ పీఎన్ జారీ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. మిగిలిన భూమికి సంబంధించిన ప్రక్రియను సైతం నిబంధనల మేరకు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుతో జిల్లాలో రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో పాటు వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి, పర్యాటక రంగ విస్తరణకు మరింత అవకాశం కలుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

