ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్‌

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదిత విమానాశ్రయ (Adilabad airport) విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఎలాంటి జాప్యానికి తావులేకుండా పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఎఎఫ్) పర్యవేక్షక బృందంతో కలిసి ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణ పనుల పురోగతిపై కలెక్టర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూమి వివరాలు, ఇప్పటివరకు చేపట్టిన సర్వే, భూసేకరణ పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విమానాశ్రయ అభివృద్ధిలో భూసేకరణ ప్రక్రియ (land acquisition) అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ భూసేకరణకు సంబంధించిన అన్ని అంశాలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న భూ సర్వే పనులను పకడ్బందీగా చేపట్టాలని, సర్వే సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన వివరాలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సేకరించి, ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

విమానాశ్రయ విస్తరణ కోసం భూములు కోల్పోతున్న నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ప్రతి భూ నిర్వాసితుడికి అందాల్సిన పరిహారం, పునరావాస ప్రయోజనాలు సత్వరమే అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, భూములకు సంబంధించిన రికార్డులు, హక్కులు, ఇతర వివరాలను నిశితంగా పరిశీలించి అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఎయిర్‌ఫోర్స్‌ పర్యవేక్షక బృందం సభ్యులు కెప్టెన్‌ రాకేష్‌, ఎస్‌.ఆర్‌. సింగ్‌, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, ల్యాండ్‌ సర్వే ఆర్‌ఏడీ ప్రభాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీష్‌ గౌడ్‌, సంబంధిత శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>