epaper
Thursday, March 5, 2026
epaper

ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో ‘సర్’ నోటిఫికేషన్ !

కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) దేశవ్యాప్తంగా చేపట్టిన ‘సర్’ (SIR) ప్రక్రియ వేగవంతమైంది. ఫస్ట్ ఫేజ్‌లో బీహార్, అసోం రాష్ట్రాల్లో పూర్తయింది. సెకండ్ ఫేజ్‌లో మరో 12 రాష్ట్రాల్లో మొదలైన ఈ ప్రాసెస్ ముగింపు దశలో ఉన్నది. మిగిలిన 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించేలా ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో నోటిఫికేషన్ వెలువడనున్నది. దీనికి అవసరమైన సన్నాహకాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) ఆధ్వర్యంలో మొదలయ్యాయి. తెలంగాణలో సైతం నెల రోజుల నుంచి ‘రాండమ్’గా కొనసాగుతున్నది. లాంఛనంగా నోటిఫికేషన్ వెలువడగానే ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఇది ముమ్మరం కానున్నది. రాష్ట్రంలోని మొత్తం 3.36 కోట్ల మంది (2025 తుది జాబితా ప్రకారం) ఓటర్లను వారి ఇండ్లకు వెళ్ళి బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) వెరిఫై చేయనున్నారు.

మ్యాపింగ్, మ్యాచింగ్ వివరాల సేకరణ :

ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే సీఈఓ సిబ్బంది ప్రాథమిక కసరత్తు ప్రారంభించారు. ఈసీ 2002లో పూర్తిచేసిన తుది జాబితాను, 2025 విడుదల చేసిన ఫైనల్ రోల్ లిస్టును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆ జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలను పోలింగ్ స్టేషన్ ఆధారంగా మ్యాచింగ్ చేస్తున్నారు. ఆ రెండు జాబితాలతో వెరిఫై అయినవారు, కానివారి వివరాలతో మ్యాపింగ్ ప్రక్రియను కూడా డిజిటల్ రూపంలో చేస్తున్నారు. ఎలాగూ ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికానున్నది. ప్రిపరేటరీ వర్క్ తరహాలో జరుగుతున్న ఈ ఫీల్డ్ సర్వే అనుభవం ఏప్రిల్ థర్డ్ వీక్ నుంచి ప్రారంభమయ్యే పూర్తిస్థాయి ప్రక్రియకు ఉపయోగపడుతుందన్నది సీఈఓ అధికారుల అభిప్రాయం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంకా ప్రిపరేటరీ వర్క్ మొదలుకాకపోవడంతో ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని తెలిపారు.

రెండు వారాలు డాక్యుమెంటేషన్ పని :

నోటిఫికేషన్ వెలువడే నాటికి ఎన్యూమరేటర్ ఫామ్‌ల ముద్రణ, బీఎల్ఓలకు కిట్‌ల తయారీ పూర్తవుతుంది. నోటిఫికేషన్ వెలువడగానే ఈసీ నుంచి వచ్చే మార్గదర్శకాలు, ఆదేశాలకు అనుగుణంగా ఒక వారమంతా బీఎల్‌ఓలకు ఫైనల్ ట్రెయినింగ్ ఉంటుంది. సందేహాలు, కొత్త గైడ్‌లైన్స్ మీద ఈసీ, సీఈఓ అధికారులు అవగాహన కల్పిస్తారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో మాస్టర్ ట్రెయినింగ్ ఇప్పటికే పూర్తయింది. రెండో వారమంతా ఎన్యూమరేటర్ ఫామ్‌లను జిల్లా కేంద్రాల మొదలు, మండలాలు, గ్రామ స్థాయి వరకు, అర్బన్ ప్రాంతాల్లో వార్డు స్థాయి వరకు పంపిణీ చేసే ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత జిల్లా ఎన్నికల అధికారుల సూచనలు, వర్క్ డివిజన్ ప్రకారం ‘సర్’ ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రారంభమవుతుంది. రాష్ట్రమంతా ఇది కంప్లీట్ చేయడానికి కనీసంగా నాలుగు నెలలు పట్టనున్నట్లు సీఈఓ అధికారుల సమాచారం.

సర్ ఫీల్ఢ్ వెరిఫికేషన్ మెకానిజం ఇలా :

ఒక్కో బీఎల్ఓ తన పరిధిలోని 350 మంది ఓటర్ల వివరాలను ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా రూపొందిస్తారు. ప్రతీ పది మంది బీఎల్ఓలకు ఒక సూపర్‌వైజర్ ఉంటారు. రోజూ సేకరించిన వివరాలను ఫిజికల్‌గా ఎన్యూమరేటర్ ఫామ్‌లలో భర్తీ చేసిన తర్వాత ఈసీ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా డిజిటల్‌ రూపంలో అప్‌లోడ్ చేస్తారు. మండల స్థాయిలో తాసీల్దారు అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా (AERO), ఈఆర్వోగా రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవో వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో ఎలక్షన్ ఆఫీసర్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు. బీఎల్ఓలకు అవసరమైతే ఒక అసిస్టెంట్‌ను కూడా సీఈఓ ఆఫీస్ సమకూర్చనున్నది. రాష్ట్రంలోని మొత్తం 37 వేల పోలింగ్ కేంద్రాల బీఎల్ఓలు, మరో 15 వేల మంది అసిస్టింట్ బీఎల్ఓలు, సూపర్‌వైజర్లు.. ఇదా దాదాపు 60 వేల మంది సిబ్బంది ‘సర్’ ప్రక్రియలో పాల్గొననున్నారు.

గ్రీవెన్స్ కోసం నెల రోజుల గడువు :

క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు వివరాలను సేకరించిన తర్వాత ఓటర్ల పేర్లు గల్లంతైనా, కొత్తగా చేరకపోయినా, పేర్లతో పాటు అడ్రస్ మిస్‌మ్యాచ్ లాంటివి ఉన్నా వారి ఫిర్యాదులు, అభ్యంతరాలు, అభిప్రాయాలను తీసుకుని పరిష్కరించడానికి ఈసీ ఆదేశాల మేరకు నెల రోజుల గడువు ఉంటుంది. వాటిని పరిశీలించిన తర్వాత పరిష్కారం చేసి తుది జాబితా సిద్ధమవుతుంది. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి మొత్తం ప్రక్రియ పూర్తికావచ్చన్నది సీఈఓ ఆఫీస్ అంచనా. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, టెక్నికల్‌గా వచ్చే ఇబ్బందులు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కాస్త అదనపు గడువే తీసుకుంటామని సూచనప్రాయంగా తెలిసింది. ‘సర్’ ప్రక్రియతో డూప్లికేట్ (ఒకే ఓటరు వేర్వేరు చోట్ల ఉండడం) ఓటర్లు ఫిల్టర్ అవుతారన్నది వారి విశ్వాసం. అర్హత కలిగినవారి పేర్లు యధావిధిగా ఉంటాయని, సమగ్రమైన వివరాలు, నిర్దిష్టమైన ప్రూఫ్ లేనివారి పేర్లు జాబితాలోకి రావన్నది వారి అభిప్రాయం.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!