కలం, వనపర్తి: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లా (Wanaparthy) వ్యాప్తంగా ఘనంగా ప్రారంభించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం (నవంబర్ 19) సాయంత్రం సిద్దిపేట జిల్లా నుంచి పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ఒకేసారి ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పథకం ప్రారంభోత్సవాలను స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. అనంతరం రెండు వారాల పాటు గ్రామాలు, మున్సిపల్ వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు సేకరించాలని ఆదేశించారు. దరఖాస్తుల్లో బీమా పొందే వ్యక్తి, నామినీ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని స్పష్టం చేశారు.
పథకం ఉద్దేశం, ప్రయోజనాలు, దరఖాస్తు విధానంపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని, గ్రామాల్లో మైక్ ప్రచారం, పోస్టర్లు, కరపత్రాలు, ప్రజా సమావేశాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు సేకరించేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఖిమ్యా నాయక్, వినోద్ కుమార్, డీఆర్వో రామ్‌రెడ్డి, డీఆర్డీవో ఉమాదేవి, సీపీఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

