లారీలకు పార్కింగ్ స్థలంగా జగిత్యాల బైపాస్ రోడ్డు

కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు (Jagtial Bypass Road) లారీలు, టిప్పర్లకు పార్కింగ్ స్థలంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో ఏర్పడే ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించేందుకు నిర్మించిన బైపాస్‌ రహదారి లక్ష్యం నీరుగారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ధరూర్‌ గ్రామం నుంచి చెల్గల్‌ వరకు ఏర్పాటు చేసిన ఈ రహదారిపై టిప్పర్లు, లారీలను నిలిపివేయడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణంలోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా, కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్‌, నిజామాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేందుకు నిర్మించిన బైపాస్‌ రహదారి భారీ వాహనాల పార్కింగ్‌ స్థలంలా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

క్రీడా ప్రాంగణం లారీల అడ్డాగా..?

జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌ గ్రామ క్రీడా ప్రాంగణం పరిసరాల్లో టిప్పర్లు, లారీలు నిలుపుతుండటంతో క్రీడా స్థలం వినియోగంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్రీడలకు ఉపయోగపడాల్సిన ప్రాంగణాన్ని భారీ వాహనాల పార్కింగ్‌కు వినియోగించేలా అనుమతులు ఇచ్చారా.. లేదా. అనే అంశాలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. భారీ వాహనాల నిలుపుదలపై జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా.. క్షేత్రస్థాయిలో నిబంధనలు అమలు కావడం లేదని వాహనదారులు పేర్కొన్నారు.

అధికారుల స్పందన కరువు..

బైపాస్‌ రహదారిపై భారీ వాహనాల నిలుపుదలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా.. సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన స్పందన కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బైపాస్‌ మలుపుల వద్ద వాహనాల నిలుపుదలను నియంత్రించడంతోపాటు ధరూర్‌ క్రీడా ప్రాంగణం వినియోగంపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు. కోట్లు వెచ్చించి నిర్మించిన బైపాస్‌ రహదారి వాహనదారులకు ఉపయోగపడుతుందా.? లేకపోతే టిప్పర్లు, లారీల పార్కింగ్‌కే పరిమితమవుతుందా.? అనేది చెప్పాలని సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>