కలం, జగిత్యాల: ధర్మపురి బస్‌స్టేషన్ (Dharmapuri Bus Station)ను రూ.2.57 కోట్లతో ఆధునీకరించబోతుండగా.. నిర్మాణ పనులకు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రాజెక్టులో భాగంగా రెండు ప్లాట్‌ఫారాల విస్తరణ, సీసీ పేవ్మెంట్, గ్రానైట్ ఫ్లోరింగ్, భవనానికి ఏసీపీ క్లాడింగ్, కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు, రూఫ్ స్లాబ్, సీలింగ్ మరమ్మతులు చేపట్టనున్నారు.
రూ.13 వేల కోట్ల ప్రయోజనం…
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇప్పటివరకు సుమారు 360 కోట్ల ఉచిత ప్రయాణాల ద్వారా మహిళలకు దాదాపు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. బాసర, భద్రాచలం, ధర్మపురి, గూడెం, కాళేశ్వరం తదితర పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ధర్మపురి నుంచి ముంబైకి ఏసీ బస్సు నడిపే ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు. 1993లో ప్రారంభమైన ధర్మపురి బస్‌స్టేషన్‌ను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు ముందే ధర్మపురిలో బస్ డిపో నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు.
రూ.226 కోట్ల నిధులు మంజూరు..
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలు, ఘాట్లు, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 10 కోట్లు, పుష్కర ఘాట్లు, బైపాస్ రహదారులు తదితర అభివృద్ధి పనులకు సుమారు రూ. 226 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
నాణ్యతతో పనులు పూర్తి..
జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ మాట్లాడుతూ.. బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేపట్టి, నాణ్యత విషయంలో రాజీ పడకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రయాణికులకు మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వర్షపు నీటి పారుదల వంటి సదుపాయాలు సక్రమంగా అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ నాగలక్ష్మి, గ్రంథాలయ సంస్థ ఛైర్పర్సన్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.

