కలం, నల్లగొండ: జగదీష్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ ఆయనకే సెల్ఫ్ గోల్ గా మారిందని ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) అన్నారు. సీఎల్పీ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో జగదీష్ రెడ్డి (Jagadish Reddy) సింగరేణిపై ఏనాడైనా సమీక్ష నిర్వహించారా? అని వీరేశం ప్రశ్నించారు.
విద్యుత్ రంగంపై కనీస అవగాహన, పనితీరులో పట్టు లేని అసమర్థ మంత్రిగా ఆయన వ్యవహరించారని వేముల వీరేశం విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం విదేశీ బొగ్గు దిగుమతుల ఒప్పందం చేసుకున్నది నిజం కాదా? ప్రతిమా గ్రూపునకు 40 ఏళ్లకు పైగా కాంట్రాక్టు ఇచ్చిన విషయం వాస్తవం కాదా?. మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ లభించే అవకాశాలు ఉన్నప్పటికీ, ఛత్తీస్‌గఢ్ నుంచి అధిక ధరకు విద్యుత్ ఎందుకు కొనుగోలు చేశారు? అని ప్రశ్నించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై సమాధానం చెప్పాలని వేముల డిమాండ్ చేశారు. దున్నపోతుల లిఫ్ట్, శివన్నగూడెం ప్రాజెక్టు, అయిటిపాముల లిఫ్ట్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు వివరించాలన్నారు. రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేముల వీరేశం తెలిపారు. అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను విజయవంతంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా చూడటానికి ప్రత్యేకంగా ఆరుగురు ఐఏఎస్ అధికారులను నియమించామని వీరేశం వెల్లడించారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చడానికి సౌర విద్యుత్ (సోలార్ పవర్) ఉత్పత్తిని పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు, విద్యుత్ అవసరాలను తీర్చేందుకు పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. మూసీ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 30 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సైనిక అనుభవంతో సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు.
ప్రజల తీర్పు.. బీఆర్ఎస్ నేతలకు గుణపాఠం
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వేముల వీరేశం (Vemula Veeresham) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది అమరుల బలిదానాలను బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయ ప్రయోజనాలకే వాడుకున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తెలంగాణ ప్రజలు తీర్పు ఇస్తారని వేముల వీరేశం ధీమా వ్యక్తం చేశారు.
Also Read : పొంగులేటి అధ్యక్షతన కాంగ్రెస్ కీలక సమావేశం
Follow Us On : WhatsApp

