కలం, జోగులాంబ గద్వాల: మల్దకల్ (Maldakal) మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల పక్కనే మాంసం దుకాణాల్లో నిర్వహిస్తున్న ‘మందు సిట్టింగ్‌ల’పై పోలీసులు ఆదివారం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మల్దకల్ ఎస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి ఉన్న చికెన్, మటన్ దుకాణాలతో పాటు వాటి అనుబంధ గదులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల యజమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టమర్లు తమ ప్రాంగణంలో మద్యం సేవించేందుకు ఎలాంటి స్థలం కేటాయించకూడదని స్పష్టం చేశారు.
ప్రధాన రహదారుల పక్కన ఇలా బహిరంగంగా మద్యం సేవించడం వల్ల అటుగా వెళ్లే ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, దుకాణాల ప్రాంగణాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

