‘డిండి’ రద్దు వ్యాఖ్యలు.. డీకే అరుణపై మండలి చైర్మన్ ఆగ్రహం

‎కలం, నల్లగొండ బ్యూరో: డిండి ఎత్తిపోతల పథకానికి 0.6 టీఎంసీల నీటిని కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) హర్షం వ్యక్తం చేశారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిండి ప్రాజెక్టును రద్దు చేయాలంటూ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు సమంజసం కావన్నారు.

ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా మాట్లాడే బదులు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని గుత్తా (Gutha Sukender Reddy) హితవు పలికారు. జాతీయ హోదా వస్తే అవసరమైన నిధులు వచ్చి పెండింగ్ పనులు వేగంగా పూర్తవుతాయన్నారు. డిండి ఎత్తిపోతల కేవలం సాగునీటి ప్రాజెక్ట్ మాత్రమే కాదని, దశాబ్దాలుగా ఫ్లోరైడ్ సమస్యతో నలిగిపోయిన దేవరకొండ, మునుగోడు ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని గుత్తా స్పష్టం చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షిత తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యంతోనే దీనిని రూపొందించారని తెలిపారు. ఏ జిల్లా నీరు ఆ జిల్లాలోనే వినియోగించుకోవాలనే వాదన సరికాదని, అదే విధానాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తే కర్ణాటక నుంచి తెలంగాణకు చుక్క నీరు కూడా రాదని ఆయన హెచ్చరించారు. ఏఎంఆర్పీ ద్వారా హైదరాబాద్ నగరానికి 30 టీఎంసీల నీటిని అందిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రాంతీయ విభేదాలకు తావులేకుండా సమగ్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం..

‎గత ప్రభుత్వ హయాంలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వెచ్చించిన నిధుల్లో సగం నిధులు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు కేటాయించి ఉంటే ఎస్ఎల్‌బీసీ, ఉదయసముద్రం, డిండి వంటి ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయి ఉండేవన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా లిఫ్ట్ ద్వారా నీటిని అందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

ఉమ్మడి నల్గొండలో 10 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను ప్రస్తుతం 7.78 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం ఉందని, మిగిలిన పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా మరో 7.58 లక్షల ఎకరాలకు అందించాల్సి ఉందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ లో 10 లక్షల ఎకరాల ప్రతిపాదనల్లో ప్రస్తుతం 8.50 లక్షల ఎకరాలకు సదుపాయం ఉందని తెలిపారు. వలసల నివారణకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికావడం చాలా అవసరమని చెప్పారు.

నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలు నీటి కోసం వివాదాలు పడటం వల్ల ఇరు ప్రాంతాలకూ నష్టమే తప్ప మేలు జరగదని స్పష్టం చేశారు. నీటి సమస్యల పరిష్కారానికి మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అలాగే నీటి పారుదల ప్రాజెక్టుల సాధన కోసం కృషి చేసిన సీపీఐ, సీపీఎం పార్టీలకు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ప్రస్తుత ఎల్‌ నినో ప్రభావం, వాతావరణ మార్పులను పరిగణనలోకి , రాజకీయాలకు అతీతంగా ఇరు జిల్లాల రైతుల ప్రయోజనాల కోసం అందరూ కలసికట్టుగా ముందుకు సాగాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>