ఏదులాపురంను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం!: మంత్రి పొంగులేటి హామీ

​కలం, ఖమ్మం బ్యూరో: ఏదులాపురం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయమని, పట్టణ రూపురేఖలను పూర్తిగా మారుస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనితతో కలిసి పర్యటించిన మంత్రి.. పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

​మద్దులపల్లి నుంచి గొల్లగూడెం వరకు రూ. 38 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్, డివైడర్, సీసీ డ్రైన్ల పనులకు, అలాగే రూ. కోటి వ్యయంతో చేపట్టిన జంక్షన్ల అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు అత్యుత్తమ రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏదులాపురం అభివృద్ధికి ఇప్పటివరకు రూ. 75.50 కోట్ల నిధులు మంజూరు చేశామని, సుమారు రూ. 100 కోట్ల విలువైన పనులతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే గిరిజన భవన్, వసతి గృహం, నూతన రహదారుల నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనట్లు తెలిపారు. ​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ, పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పేర్కొన్నారు. గత పాలకులు సృష్టించిన ఆర్థిక అవరోధాలను అధిగమిస్తూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు.

​సూపర్ ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్నందున రానున్న రోజుల్లో నీటి లభ్యతపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వానాకాలంలో రైతులు సాగు చేసిన తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అవసరమైతే ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని భరోసా ఇచ్చారు. అయితే రాబోయే నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, రైతులు ఎవరూ రెండో పంట వేయవద్దని విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని, ఈ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా తెలంగాణకు సంపూర్ణ సహకారం అందించాలని, ఇందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీలు తగిన కృషి చేయాలని కోరారు.

​జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ.. మంజూరైన నిధులను పారదర్శకంగా వినియోగించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ ఎన్. శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, మున్సిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>