కలం, ములుగు: జిల్లా కాంగ్రెస్‌లో (Congress Politics) అంతర్గత వర్గ విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రైస్ మిల్లర్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు సంఘం మాజీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ములుగు జిల్లా (Mulugu) జాకారం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయనతో పాటు ఎనగందుల మోహన్, హరినాధం, రఘోత్తంలను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏ కేసులో ఈ చర్యలు తీసుకున్నారనే వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
ఎన్నికల వేళ అరెస్టుపై కలకలం..
అసోసియేషన్ ఎన్నికలకు ముందు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకోవడంపై ఆయన వర్గీయులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఆయనకు ఇబ్బందులు సృష్టించేందుకే ఈ చర్య తీసుకున్నారని, కాంగ్రెస్‌లోని అంతర్గత వర్గపోరే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలకు స్వతంత్ర నిర్ధారణ లేదు.
ఇటీవల ప్రవీణ్‌కు చెందిన మిల్లుల్లో పౌరసరఫరాల శాఖ తనిఖీలు నిర్వహించడం, తాజాగా సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఈ వ్యవహారం మరింత చర్చకు దారితీసింది. అరెస్టుకు ఎన్నికలతో సంబంధం ఉందా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామం అసోసియేషన్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ఉత్కంఠ నెలకొంది.

