ముంచుకొస్తున్న ‘అర్నాబ్’ తుఫాన్.. ఏపీకి భారీ హెచ్చరిక!

కలం, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడుతూ పెను తుఫాన్‌గా మారుతోంది. ప్రస్తుతం తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం, రాగల గంటల్లో తీవ్ర వాయుగుండంగా.. ఆపై తుఫాన్‌గా రూపాంతరం చెందనుంది. ఈ తుఫాన్‌కు ప్రపంచ వాతావరణ సంస్థ నిబంధనల ప్రకారం ‘అర్నాబ్’ (Arnab Cyclone) అని నామకరణం చేయనున్నారు.

ప్రస్తుతం విశాఖపట్నానికి 860 కి.మీ., కాకినాడకు 950 కి.మీ., బాపట్లకు 1130 కి.మీ దూరంలో ఈ వ్యవస్థ కదులుతోంది. ఇది సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా, మంగళవారం నాటికి బలమైన తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలపడి బుధవారం ఉదయం నాటికి యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కి.మీ. భారీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.

ఈ ప్రభావంతో ఎల్లుండి (మంగళవారం) నుంచి రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తినష్టాలను నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు.

సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, టోల్ ఫ్రీ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>