కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ పోలీసులు (Warangal Police) వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు రూ.4.83 కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేశారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 106 కేసులకు సంబంధించి పట్టుబడిన 967.864 కిలోల గంజాయిని శనివారం నిబంధనల ప్రకారం దహనం చేశారు.
తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ ఆదేశాల మేరకు డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పర్యవేక్షణలో హనుమకొండ మండలం అమ్మవారిపేట శివారులోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్ భస్మీకరణ ప్లాంట్లో గంజాయిని ధ్వంసం చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. అదనపు డీసీపీ (పరిపాలన) రాయల ప్రభాకర్ రావు, సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

