కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వలన విద్యుత్ భారం తీవ్రంగా మారిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. కరోనా సమయంలో ప్రజలు ప్రభుత్వాలకు అండగా నిలిచినట్లే, ప్రతిపక్షాలు విమర్శలు మాని ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కొదుమూరులో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
20,018 మెగావాట్లకు చేరిక..
గతంలో 6,648 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం ఏకంగా 20,018 మెగావాట్లకు చేరిందన్నారు. అక్టోబర్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని వివరించారు. సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లలో దాదాపు 15 లక్షల పంపుసెట్ల పరిధిలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని భట్టి వెల్లడించారు. నీరు లేని చోట మోటార్లు ఆన్ చేసి మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు పాడుచేసుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. గ్రామీణ కూలీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉపాధి హామీ పథకం కింద అదనంగా మరో 8 లక్షల పనులను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
రహదారుల నిర్మాణ పనులు ప్రారంభం..
మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డితో కలిసి పర్యటించారు. రూ.3.5 కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణం, రూ.8.25 కోట్లతో తిమ్మినేనిపాలెం బీటీ రోడ్డు, రూ.3 కోట్లతో రామకృష్ణాపురం-కొత్తగూడెం బీటీ రోడ్డు, రూ.50 కోట్లతో రామకృష్ణాపురం-పెద్దగోపతి రోడ్డు విస్తరణ, రూ.60 కోట్లతో కొదుమూరు వద్ద నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపనలు చేశారు. తిమ్మినేనిపాలెం, గాంధీనగర్ ఎస్సీ కాలనీల్లో రూ.1.08 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. సుడా ఛైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఆలయ కమిటీ ఛైర్మన్ వేముల సతీష్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

