కలం, మధిర: నెలల తరబడి చెమటోడ్చి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి కళ్ల ముందే నేలపాలైతే ఆ రైతు గుండె కోత వర్ణనాతీతం. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు రైతన్నలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. అనుకూలించని పరిస్థితులు, పంటలను ఆవరిస్తున్న రకరకాల వైరస్లు అన్నదాతల ఆశలను బూడిద చేస్తున్నాయి. ఇందుకు మధిర మండలం మల్లారం (Mallaram) గ్రామంలో శనివారం చోటుచేసుకున్న హృదయ విదారక ఘటనే నిదర్శనంగా నిలిచింది.
మధిర మండలం మల్లారం గ్రామానికి చెందిన రైతు మందడపు నాగకృష్ణ ఎంతో కష్టపడి, నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నాలుగెకరాల్లో మిరప తోట సాగు చేశాడు. పంట బాగానే వస్తోందని ఆశపడ్డ ఆ రైతుకు చివరకు నిరాశే మిగిలింది. వైరస్/తెగుళ్లు తోటను ఆవరించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తెగుళ్లను నివారించడానికి చేయని ప్రయత్నం లేదు, వాడని మందు లేదు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోగా, వైరస్ మరింత వేగంగా పాకి పక్కనున్న ఆరోగ్యకరమైన పంటలకు కూడా సోకే ప్రమాదం ఏర్పడింది.
చేసేదిలేక, పెట్టుబడి పెట్టిన డబ్బులు దక్కకపోగా.. కంటి ముందు కాలిపోతున్న ఆశలను చూస్తూ తలవంచుకుని, స్వయంగా తన ట్రాక్టర్తోనే ఆ నాలుగెకరాల మిరప తోటను దున్నివేయాల్సి వచ్చింది. స్వయంగా ఆయనే తన చేతులతో తోటను నాశనం చేస్తున్న ఆ దృశ్యం స్థానికులను, తోటి రైతులను తీవ్రంగా కలచివేసింది. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులు, ఎల్నినో ప్రభావం వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల కారణంగా తోటల్లో తెగుళ్ల బెడద విపరీతంగా పెరిగిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగులో మెలకువలు, తెగుళ్ల ముందస్తు నివారణపై సరైన అవగాహన లేకపోవడం అన్నదాతల నష్టాలను మరింత పెంచుతోంది.
ఈ నేపథ్యంలో సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ నాగకృష్ణ లాంటి రైతులను ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. వ్యవసాయ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకూ తగిన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురుకాకుండా వాతావరణ మార్పులకు అనుగుణంగా తీసుకోవాల్సిన సాగు మెలకువలు, తెగుళ్ల కట్టడిపై రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

