కలం, వనపర్తి: ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలు (CMR Dues) చెల్లించకుండా డిఫాల్టర్ జాబితాలో ఉన్న మిల్లర్లు.. ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్‌కుమార్ (Additional Collector Vinod Kumar) సూచించారు. బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం 45 రోజుల గడువు ఇచ్చిందని, ఈలోగా బకాయిలను పూర్తిగా చెల్లించి డిఫాల్టర్ జాబితా నుంచి బయటపడాలని స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో పౌరసరఫరాల విజిలెన్స్ డిప్యూటీ కమిషనర్ కొండలరావు, డీఎస్పీ వెంకటేశంతో కలిసి మిల్లర్లు, సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. 2014 నుంచి 2025 ఖరీఫ్ సీజన్ వరకు పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించిందని తెలిపారు.
ఈ అవకాశాన్ని వినియోగించుకుని బకాయిలు చెల్లిస్తే నాన్-డిఫాల్టర్ జాబితాలోకి చేరడంతో పాటు రాబోయే సీజన్లలో ధాన్యం కేటాయింపులు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయితే, 2022 రబీ వేలం ధాన్యానికి సంబంధించిన బకాయిలకు ఈ అవకాశం వర్తించదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సీఎంఆర్ సమర్పించని మిల్లర్లపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వేలం ప్రక్రియకు సంబంధించిన పెండింగ్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ అధికారి ఆంజనేయులు, సంబంధిత అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.

