కలం, మునుగోడు : రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. ముగ్గురు పిల్లలతో అతి కష్టంగా జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంపై అనుకోని కష్టం పిడుగులా పడింది. ఆరేళ్ల వయసులోనే అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడికి మెరుగైన వైద్యం అందించేందుకు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి ఆ తల్లిదండ్రులను కన్నీరుమున్నీరు చేస్తోంది. చండూరు (Chandur) మండల పరిధిలోని పడమటి తాళ్ల గ్రామానికి చెందిన గుండెగోని శ్రీశైలం కుటుంబం అత్యంత పేదరికంలో జీవనం సాగిస్తోంది.
శ్రీశైలంకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేసుకునేందుకు కనీసం అర ఎకరం భూమి కూడా సరిగ్గా లేని ఈ కుటుంబం కష్టపడి జీవిస్తోంది. రోజువారీ అవసరాలనే అతి కష్టంగా నెట్టుకొస్తున్న తరుణంలో, కుటుంబానికి ఆశాకిరణంగా ఉండాల్సిన చిన్న కుమారుడు తరుణ్ అనారోగ్యం బారిన పడటంతో వారి జీవితాల్లో ఆందోళన అలుముకుంది.
మెదడులో మచ్చ.. ఎడమ చేయి, కాలు పనిచేయని పరిస్థితి:
ఆరేళ్ల చిన్నారి తరుణ్ మెదడులో మచ్చ రావడంతో ఎడమ చేయి, ఎడమ కాలు పూర్తిగా పనిచేయడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్న వయసులోనే బిడ్డకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తమ బిడ్డ మళ్లీ ఆరోగ్యంగా కోలుకొని తోటి పిల్లలతో కలిసి సాధారణ జీవితం గడపాలని ఆశపడుతున్నారు.
చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని అంకురా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స కోసం సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న శ్రీశైలం కుటుంబానికి ఇంతటి భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం పెను భారంగా మారింది.
ఆర్థికంగా ఆదుకునేవారి కోసం ఎదురుచూపు :
ఒకవైపు బిడ్డ ఆరోగ్యంపై ఆందోళన, మరోవైపు వైద్య ఖర్చుల భారం.. ఈ రెండింటి మధ్య శ్రీశైలం కుటుంబం తీవ్ర మనోవేదనను ఎదుర్కొంటోంది. చిన్నారి చికిత్సకు అవసరమైన డబ్బు సమకూరితే మెరుగైన వైద్యం అందించవచ్చనే ఆశతో దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా స్థోమత ఉన్నవారు తమకు తోచినంత సహాయం అందిస్తే చిన్నారి చికిత్సకు ఎంతో ఉపయోగపడుతుంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సేవా భావం కలిగిన ప్రతి ఒక్కరూ స్పందించి చిన్నారి కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్‌పే నంబర్ 7075947405 కి ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు.

