కలం, వనపర్తి: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. నీటి వృథాను అరికట్టడంతోపాటు ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
శనివారం వనపర్తి (Wanaparthy) జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి వెబెక్స్ ద్వారా సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి సరఫరా ప్రణాళిక, వీబీజీ రామ్జీ పథకం పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో నీటి పైపులైన్ల లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి
నవంబరు 15 నుంచి డిసెంబరు 30 వరకు మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తాగునీటి సరఫరాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, మండలస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని స్థానిక నీటి వనరులను వినియోగంలోకి తీసుకురావాలని, అవసరమైన చోట ప్రైవేటు బోర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
ఉపాధి పనుల లక్ష్యాలు పూర్తి చేయాలి
వీబీజీ రామ్జీ పథకం కింద కూలీలకు పనిదినాల కల్పనలో పురోగతి తక్కువగా ఉందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనిదినాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో కూలీలను సమీకరించి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జి నిర్మాణాల వంటి నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పెంపొందించే పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షిస్తూ.. రూఫ్ రీప్లేస్మెంట్కు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారులను కేటాయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండలాల వారీగా అర్హులను గుర్తించి వివరాలు సిద్ధం చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో యాదయ్య, డీఆర్డీవో ఉమాదేవి, మిషన్ భగీరథ ఎస్ఈ, హౌసింగ్ పీడీ విఠోబా, సీపీవో హరికృష్ణతోపాటు వెబెక్స్ ద్వారా తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

