కలం, నిర్మల్: పత్తి కొనుగోళ్లపై (Cotton purchases) ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలను తొలగించి, రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ (CPI Leader Ramesh) డిమాండ్ చేశారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పత్తి పంటకు క్వింటాల్‌కు రూ.18 వేల ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసిన రైతులకు ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ఇబ్బందులు కలిగించాయని తెలిపారు.
సరైన వర్షాలు కురవకపోవడంతో పత్తి దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదని, ఎల్‌నినో ప్రభావంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోళ్లపై నిబంధనలు, ఆంక్షలు విధించడం వల్ల రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సీసీఐ పత్తి కొనుగోళ్ల సమయంలో తేమ శాతం పేరుతో రైతులకు నష్టం కలిగించకుండా, పంట నాణ్యతను పారదర్శకంగా పరిశీలించి తగిన ధర చెల్లించాలని కోరారు. రైతులు పండించిన పత్తి మొత్తాన్ని కొనుగోలు చేసి, గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు జాదవ్ శంకర్, సంతోష్, పుండలిక్, అనంతరావు తదితరులు పాల్గొన్నారు.

