కలం, యాదగిరిగుట్ట: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతన్నకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయని సీపీఎం మండల కార్యదర్శి గడ్డం వెంకటేష్ (Gaddam Venkatesh) ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడుల కోసం అప్పులు చేసి, పంట చేతికొస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు ఎండిపోతున్న వరి పొలాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు సాగునీటి కొరత, ఇంకోవైపు వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపించిందన్న ఆరోపణలు రైతులను మరింత సంక్షోభంలోకి నెడుతున్నాయన్నారు. పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నా నష్టాన్ని అంచనా వేసి రైతులకు భరోసా కల్పించే చర్యలు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలం పెద్దకందుకూరు గ్రామంలో జమ్ము రాజశేఖర్, జాగిల్లాపురం బాలకృష్ణ, శ్రీనివాస్, పెంటయ్య తదితర రైతులకు చెందిన ఎండిపోయిన వరి పంటలను గడ్డం వెంకటేష్‌తో పాటు సీపీఎం నాయకులు పరిశీలించారు. పొలాల్లో ఎండిపోతున్న పంటలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
పొలాల్లో పంట నష్టం.. అధికారులకు కనిపించడం లేదా?
భూగర్భ జలాలు అడుగంటడం, బోరు మోటార్లు పనిచేయకపోవడం, కాలువల ద్వారా సక్రమంగా సాగునీరు అందకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వెంకటేష్ పేర్కొన్నారు. చొల్లేరు, చిన్నకందుకూరు, మర్రిగూడెం తదితర గ్రామాల్లోనూ వరి పంటలు ఎండిపోతున్నాయని, ఆయా గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను కార్యాలయాలకే పరిమితం చేయకుండా పొలాల్లోకి వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. గ్రామాల వారీగా ఎండిపోయిన పంటల వివరాలను సేకరించి, నష్టపోయిన రైతులను గుర్తించి, నష్టపరిహారం అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పంట నష్టం జరిగిన తర్వాత కూడా పరిహారం కోసం రైతులు ఎదురుచూడాల్సి రావడం వారిపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
హామీలు ఇచ్చారు.. రైతులకు భరోసా ఏది?
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గతంలో వ్యవసాయ రంగానికి సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారని వెంకటేష్ గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించి, బాధిత రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్వయంగా గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించడంతో పాటు ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు పరిహారం అందేలా చొరవ చూపాలని కోరారు. వరి సాగుకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో రైతుల్లో నెలకొంటున్న ఆందోళనను తొలగించి, సాగునీరు, పంటల రక్షణ, నష్టపరిహారం విషయంలో స్పష్టమైన భరోసా కల్పించాలని అన్నారు. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
స్పందించకపోతే ఆందోళన తప్పదు!
ఎండిపోయిన వరి పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని గడ్డం వెంకటేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోతే రైతులను సమీకరించి మండల తహశీల్దార్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, స్థానిక ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ శాఖ కార్యదర్శి, మండల కమిటీ సభ్యులు కాలే స్వామి, జోగు శ్రీనివాస్, పత్తి నరసింహ, జాగిల్లాపురం బాలనరసింహ, జాగిల్లాపురం అశోక్, పాండు తదితరులు పాల్గొన్నారు.

