కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad PowerGrid)లోని కవాడిగూడలో ఉన్న పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో మహిళల భద్రతకు భంగం కలిగించే తీవ్రమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 13న ఆరో అంతస్తులోని మహిళా వాష్‌రూమ్‌కు వెళ్లిన ఒక సీనియర్ మహిళా అధికారిణి, అక్కడి వాష్ బేసిన్ కింద డబుల్ సైడెడ్ టేప్‌తో అతికించి ఉన్న ఒక రహస్య మొబైల్ ఫోన్‌ను అనుమానాస్పదంగా గుర్తించారు. ప్రాథమికంగా అది ఎయిర్ ఫ్రెష్నర్ అయి ఉంటుందని భావించినప్పటికీ, కాగితంలో చుట్టి ఉన్న ఆ పరికరంలో చిన్న రంధ్రాలు ఉండటంతో అనుమానం వచ్చి ఆమె దానిని బయటకు తీసుకొచ్చారు.
ఫోన్ తెచ్చిన అధికారిణి అది ఎవరిదని విచారిస్తుండగా, అక్కడే ఉన్న ఫ్లోర్ అటెండెంట్ భరత్ హఠాత్తుగా ముందుకు వచ్చి ఆ ఫోన్‌ను బలవంతంగా లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన బాధితురాలు, సహోద్యోగులు.. భద్రతా సిబ్బంది సాయంతో అతడిని అడ్డుకుని పట్టుకున్నారు. రహస్య వీడియోలు రికార్డు అయ్యాయో లేదో పరిశీలించేందుకు ఫోన్ లాక్ పిన్ నంబర్ అడగ్గా, భయాందోళనకు గురైన నిందితుడు ఆ ఫోన్‌ను నేలకేసి కొట్టి ధ్వంసం చేశాడు.
అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు భరత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు తీవ్రత, ఫోన్ డేటా రికవరీ ప్రాధాన్యత దృష్ట్యా, ఈ వ్యవహారాన్ని లోతైన దర్యాప్తు కోసం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు.

