కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి తర్వాత మే వరకు 4 నెలల పాటు ప్రత్యేక పథకాన్ని తీసుకువస్తామని సీఎం రేవంత్ (Revanth Reddy) తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ పథకం కోసం ఖర్చు పెట్టబోతున్నదని చెప్పారు. ఈ స్కీమ్ అమలు కోసం ప్రతీ ప్రజాప్రతినిధి గ్రామాలకు వెళ్లాల్సిందేనని, అందరి ఫోన్లలో ప్రత్యేక మొబైల్ యాప్ పెట్టి పర్యవేక్షణ చేస్తామన్నారు. ఎల్ నినో పరిస్థితులపై ప్రజాభవన్‌లో నిర్వహించిన రివ్యూ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం తెలిపారు.
ఈ కొత్త స్కీమ్‌లో భాగంగా వ్యవసాయ పొలాలకు వెళ్లే దారులు, కాలువలు, చెరువులు, కుంటలను పునరుద్ధరించుకోవడం ప్రధాన టాస్క్‌గా ఉంటుందని సీఎం అన్నారు. ప్రతీ ఒక్కరికి పని కల్పించాలి.. ప్రతి ఒక్కరికీ అన్నం పెట్టాలి… పకడ్బందీగా ఈ పథకాన్ని రూపొందించి అమలు చేయాలి… అని అన్నారు. రైతులను ఉత్తేజపరచడానికి కళాజాతాలను సిద్ధం చేయాలని, గాంధీభవన్‌లో ఎంపీ చామల కిరణ్ నేతృత్వంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు.
చేతి నిండా పని.. కడుపు నిండా భోజనం
కర్నాటక, తమిళనాడుకు వెళ్లి కరువు రావాలంటూ హరీశ్ రావు క్షుద్రపూజలు చేశారని, అద్దంకి దయాకర్ గతంలో ఇదే చెప్పారని, ఇప్పుడు అలాంటి క్షుద్రపూజలు చేసినవారి మాటలను నమ్మొద్దని రేవంత్ అన్నారు. చేతినిండా పని.. కడుపునిండా భోజనం.. ఇదే మన కార్యాచరణ… అని వివరించారు. విద్యుత్ ఇచ్చినా బోర్లలో నీళ్లు లేవని, రైతులకు పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా పోతుందన్నారు. వచ్చే వానాకాలంలో బ్రహ్మాండమైన పంటలు పండించుకోవచ్చని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్నారు.
బీఆర్ఎస్ లీడర్లను గుంజ పాతి కొట్టాలి
కేసీఆర్‌కు అన్నీ ఉన్నాయి కానీ మైండ్ పనిచేయడం లేదని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను, జగదీశ్ రెడ్డిని దామరచర్ల దగ్గర గుంజ పాతి కొట్టినా తప్పులేదన్నారు. తెలివి ఉన్నోళ్లు ఎవరైనా రా మెటీరియల్ ఉన్న దగ్గరే ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారని, కానీ యాదాద్రి థర్మల్ ప్లాంట్ విషయంలో మాత్రం బొగ్గు నిక్షేపాలు లేని చోట నిర్మించారని విమర్శించారు. సింగరేణిలో లభ్యం కాని జీ-9 రకం బొగ్గుతో యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్ డిజైన్ చేశారని, విదేశాల నుంచి కృష్ణపట్నం పోర్టు ద్వారా ఆ రకం బొగ్గును దిగుమతి చేసుకుని యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఆలోచించారని అన్నారు. రామగుండం, కొత్తగూడెం, మంచిర్యాల లాంటి ప్రాంతాల్లో యాదాద్రి ప్లాంట్‌ను నిర్మిస్తే రూ.28 వేల కోట్లతో 2019 నాటికే పూర్తయ్యేదని, ఏటా రూ.2 వేల కోట్ల బొగ్గు రవాణా భారం తగ్గేదన్నారు. 4 వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌కు రూ.8 వేల కోట్లు అదనంగా ఖర్చు అయిందన్నారు. దీంతో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు 6 రూపాయలకు పైగా పెరిగిందన్నారు.
లక్ష కోట్ల అవినీతి కోసమే కేసీఆర్ డిజైన్, ప్లాన్
యాదాద్రి థర్మల్ ప్లాంట్ డిజైన్లోనే లోపం ఉండడంతో ఇప్పుడు ఒడిశాలోని నైని బ్లాక్ నుంచి, కోల్ ఇండియా నుంచి, మహాదని కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గును తెచ్చుకోవాల్సి వస్తున్నదని సీఎం వివరించారు. యాదాద్రి ప్లాంట్‌లో ఒక్కొక్క యూనిట్‌ను పట్టాలెక్కిస్తున్నామని, మూడు రోజుల కిందే ఐదో యూనిట్ (800 మెగావాట్లు) కూడా గ్రిడ్‌కు అనుసంధానమైందన్నారు. జీ-9 రకం బొగ్గును మాత్రమే వాడేలా బాయిలర్ డిజైన్ చేయడంతో దీన్ని దిగుమతి చేసుకునే ప్రక్రియలో ప్రతిమా గ్రూపు శ్రీనివాసరావుకు ప్రయోజనం కలిగించాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ ప్లాంట్ లైఫ్ టైమ్ 50 ఏండ్లలో లక్ష కోట్ల లాభం వచ్చేలా కేసీఆర్ ప్రయత్నం చేశారని సీఎం ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కేసీఆర్ కుటుంబానికే పోయాయన్నారు. ‘నేను, నా కుటుంబం’ అన్నట్లుగా వాళ్ల తీరు ఉందన్నారు.
నీళ్లు ఫామ్‌హౌస్‌కు, నిధులు బీఆర్ఎస్ ఖాతాకు..
ఎన్నేండ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ నిధుల కోసం ప్రతి నెలా వెతుక్కుంటున్నదని, కానీ పదేండ్లే పవర్లో ఉన్న బీఆర్ఎస్ ఖాతాల్లో మాత్రం రూ.1,500 కోట్లు ఉన్నాయని సీఎం వ్యాఖ్యానించారు. నీళ్లు ఫామ్ హౌజ్‌కు వెళ్తే నిధులు బీఆర్ఎస్ ఖాతాకు వెళ్లాయన్నారు. “అసెంబ్లీలో ఎదురుగా కూర్చోబెట్టి చెప్పాలని అనుకున్నాను.. భూముల విషయం బయటపెడితే తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు.. చివరకు పాలు కూడా వదల్లేదు.. ప్రైవేట్ ఆస్పత్రులు, విద్యాసంస్థలకు హరీశ్ రావు పాలు అమ్మారు.. సంతోష్ రావుకు ‘టానిక్’ ద్వారా విదేశాల నుంచి నేరుగా మద్యం దిగుమతి చేసుకుని అమ్ముకునే అవకాశం ఉంది.. మనం మౌనంగా ఉంటే అర్ధాంగీకారంగా భావిస్తున్నారు” అని సీఎం వ్యాఖ్యానించారు.

