కలం, వెబ్ డెస్క్ : సాధారణంగా అత్యంత శీతల వాతావరణానికి పేరుగాంచిన ఐరోపా ఖండం (Europe Heatwave) ఈ ఏడాది భానుడి ప్రతాపానికి అల్లాడిపోతోంది. ఐరోపా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరడం, తీవ్ర వడగాలులు బీభత్సం సృష్టిస్తుండడంతో యూరప్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
తాజాగా వెలువడిన అధ్యయన నివేదికల ప్రకారం.. ఐరోపా నగరాల్లో ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలకు తాళలేక ఏకంగా 50,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. సాధారణంగా 12 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే ఉష్ణోగ్రతలు, ఈసారి ఫ్రాన్స్‌లో ఏకంగా 43.8 డిగ్రీలు, జర్మనీలో 41.7 డిగ్రీలు, బ్రిటన్‌లో 37.3 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవడమే ఈ ఆందోళనకర పరిస్థితులకు కారణమైంది.
సహారా ఎడారి నుంచి వీస్తున్న తీవ్ర వేడిగాలులకు తోడు, వాతావరణంలో వేడి ఒకేచోట బందీ అయిపోయే ‘హీట్ డోమ్’ వాతావరణ పరిస్థితులు తలెత్తడంతోనే ఐరోపాలో ఈ విపత్తు సంభవించింది. అంతేకాకుండా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితులు, మానవ తప్పిదాలైన శిలాజ ఇంధనాల వాడకం, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ఈ వాతావరణ మార్పులను మరింత తీవ్రతరం చేశాయని సైంటిస్టులు అంటున్నారు.
ఈ మరణాల్లో దాదాపు మూడింట రెండు వంతులు నేరుగా వాతావరణ మార్పుల వల్లే చోటుచేసుకున్నట్లు ఇంపీరియల్ కాలేజ్ లండన్ నిపుణుల పరిశోధన బృందం వెల్లడించింది. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ వంటి ప్రధాన దేశాల్లో ఈ తీవ్రత అధికంగా ఉంది. మరణించిన వారిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులే అధికంగా ఉన్నప్పటికీ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది సైతం ఈ రికార్డు ఉష్ణోగ్రతల ధాటికి ప్రాణాలు విడిచారు.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ ఊహించని పరిణామాలు కేవలం ప్రాణ నష్టానికే పరిమితం కాకుండా అడవుల్లో కార్చిచ్చులకు, పంటల నష్టానికి, తాగునీటి ఎద్దడికి దారితీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు ఏ స్థాయికి చేరుకున్నాయో చెప్పడానికి ఐరోపాలో నెలకొన్న ఈ భయానక పరిస్థితులే నిదర్శనమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్బన్ ఉద్గారాలను తక్షణమే తగ్గించకపోతే ప్రతికూల వాతావరణానికి తగినట్లుగా ఐరోపా దేశాలు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టకపోతే, రాబోయే రోజుల్లో మానవాళి మరిన్ని భయంకరమైన వాతావరణ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

