కలం, ఇంద్రవెల్లి: ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన వీరుడు కొమురం భీమ్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఇంద్రవెల్లి (Indravelli) మండల కేంద్రంలో శుక్రవారం కొమురం భీమ్ కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నుంచి ఆదివాసీ నాయకులు, ప్రజలు భారీ పాదయాత్ర నిర్వహించారు. డోలు వాయిద్యాలు, సంప్రదాయ కళారూపాల నృత్యాల నడుమ విగ్రహావిష్కరణ ప్రాంగణానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం మార్కెట్ యార్డులో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కులు, అస్తిత్వం కోసం పూర్వీకులు సాగించిన పోరాట స్ఫూర్తి నేటి తరంలోనూ కొనసాగాలని పిలుపునిచ్చారు. పూర్వీకులు అందించిన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కొమురం భీమ్ విగ్రహావిష్కరణ ఆదివాసీ సమాజానికి సంతోషకరమైన రోజని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదివాసీ సంఘాల రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు.

