ఛాయా సోమేశ్వరాలయానికి రూ.20 కోట్ల నిధులు మంజూరు

కలం, నల్లగొండ: చారిత్రక నల్లగొండ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పానగల్ ఛాయాసోమేశ్వరస్వామి ఆలయం (Chaya Someshwaralayam) అభివృద్ధికి మహర్దశ పట్టనుంది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పానగల్‌లోని చారిత్రక ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జీవో నంబర్ 311 ను జారీ చేసింది.

ఆలయ సమగ్ర సుందరీకరణ, భక్తులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. సమీపంలోని జలాశయాల అభివృద్ధితో పానగల్‌ను వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పానగల్ ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయించడంపై నల్లగొండ నగరపాలక సంస్థ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నల్లగొండ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో ఆలయ రూపురేఖలు మారిపోవడంతో పాటు, భక్తులకు, పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. పానగల్ అభివృద్ధితో నల్లగొండ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభించడమే కాకుండా, రాష్ట్ర పర్యాటక చిత్రపటంలో నల్లగొండకు మరింత ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>