కలం, జోగులాంబ గద్వాల: భూ వివాదం నేపథ్యంలో దారుణ హత్యకు గురైన మల్దకల్ మండలం మద్దెలబండ పెద్ద తండా వాసి చంద్రునాయక్ (45) కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. తమకు తక్షణ రక్షణ కల్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గద్వాల కలెక్టరేట్ (Gadwal Collectorate) కార్యాలయం ఎదుట చంద్రునాయక్ భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు, బంధువులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్పందించి వారిని అడ్డుకున్నారు.
గ్రామం వీడినా వీడని భయం..
గత మే 2వ తేదీన మద్దెలబండ పెద్ద తండాలో భూ తగాదాల కారణంగా చంద్రునాయక్‌ను ఆయన దాయాదులే కిరాతకంగా హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు కొందరిని విచారించి ముగ్గురు ప్రధాన నిందితులను రిమాండ్‌కు తరలించారు. మిగతా నిందితుల నుంచి ప్రాణహాని ఉందన్న భయంతో మృతుడి కుటుంబం ఊరు విడిచి హైదరాబాద్‌లో తలదాచుకుంటోంది. ఇటీవల దసరా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన చంద్రునాయక్ కుటుంబంపై ప్రత్యర్థులు మరోసారి దాడికి పాల్పడటంతో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.
పోలీసుల తీరుపై బాధితుల ఆగ్రహం..
తమ తండ్రిని హత్య చేసిన వ్యక్తుల నుంచి తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతలో ఉన్న మల్దకల్ పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని మృతుడి పిల్లలు ఆరోపణలు చేశారు. న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ముందే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని శాంతింపజేసి, అనంతరం చంద్రునాయక్ కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ ఎదుట హాజరుపరిచారు. బాధితులు తమ గోడును ఎస్పీకి వెళ్లబోసుకుని, తమ కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజేశారు.

