ఆర్థిక భద్రతే లక్ష్యం.. రాణాపూర్ తండాలో ప్రచారం

కలం, నిర్మల్ రూరల్: దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్, ఆర్థిక సేవలను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రధాన లక్ష్యంతో చేపట్టిన దేశవ్యాప్త ముమ్మర ఫైనాన్షియల్ సాచురేషన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా.. శుక్రవారం నిర్మల్ రూరల్ మండలం రాణాపూర్ తండాలో(Ranapur Thanda) జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలోని చివరి వ్యక్తి వరకు బ్యాంకింగ్ సేవలను చేరవేయడం, ప్రతి ఒక్కరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యులను చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆర్థిక అవగాహనపై దిశానిర్దేశం చేశారు. సాధారణ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి బ్యాంకింగ్ వ్యవస్థ కల్పిస్తున్న సౌకర్యాలు, పొదుపు పథకాలు, డిజిటల్ ఆర్థిక లావాదేవీల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి సమగ్రంగా వివరించారు. రిజర్వ్ బ్యాంక్ చేపడుతున్న ఈ ప్రచార కార్యక్రమం వల్ల ఆర్థిక భద్రత పెరుగుతుందని పేర్కొన్నారు.

సమావేశంలో పాల్గొన్న బ్యాంకింగ్ అధికారులు తండా వాసులకు వివిధ ప్రభుత్వ ఆర్థిక సంక్షేమ పథకాలు, ప్రధానమంత్రి జనధన్ యోజన, సామాజిక భద్రతా బీమా పథకాలు, సూక్ష్మ రుణాలు పొందే విధానాలపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, డిజిటల్ బ్యాంకింగ్ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అధికారుల బృందం క్షుణ్ణంగా వివరించింది. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం రాములు, శ్రీనివాస్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, గ్రామ సర్పంచ్ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>