ఎల్‌నినో ఎఫెక్ట్‌.. రబీ సాగుపై కలెక్టర్ సమీక్ష

కలం, ఆదిలాబాద్: రాబోయే రబీ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో(El Nino Effect) వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, నీటి లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున.. రైతులు నష్టపోకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రబీ సీజన్ సాగు(Rabi Crops), వాతావరణ పరిస్థితులపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.

నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు పంట చేతికొచ్చిన తర్వాత మార్కెటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

పంటల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధర, గిట్టుబాటు ధరల కల్పనలో జాప్యం జరగకూడదన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేసి రబీ ప్రారంభం నుంచే కొనుగోళ్లు సజావుగా జరిగేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రతి రైతు పండించిన పంటకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు, గోనె సంచులు తదితర ఏర్పాట్లపై ముందుగానే దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీకాంత్ రెడ్డి, సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ఏడీ మార్కెటింగ్ అధికారి గజానన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>