జనగణనలో కచ్చితత్వమే కీలకం: కలెక్టర్‌ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్ : భారత ప్రభుత్వ జనాభా గణన – 2027లో(Census-2027) భాగంగా చేపట్టనున్న రెండో దశ జనాభా లెక్కింపును (ఫేజ్‌–II: పాపులేషన్‌ ఎన్యూమరేషన్‌) జిల్లాలో పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా (Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక టీటీడీసీలో సబ్‌ డివిజన్‌ ఛార్జ్‌ స్థాయి అధికారులకు రెండు రోజులపాటు నిర్వహించిన సెన్సస్‌–2027 ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జనగణన నుంచి జనకల్యాణం అనే లక్ష్యంతో జనాభా గణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ప్రభుత్వం రూపొందించే సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా అవసరాలకు అనుగుణమైన ప్రణాళికలకు జనాభా గణన ద్వారా సేకరించే ప్రామాణిక సమాచారం కీలక ఆధారంగా నిలుస్తుందన్నారు. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి వివరాలను ఖచ్చితంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గణన ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

రెండు రోజుల శిక్షణలో క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, నమోదు విధానం, సాంకేతిక అంశాలు, గణన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాస్టర్‌ ట్రెయినర్లు అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో జనాభా గణన సజావుగా సాగేలా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. జనాభా గణన ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, ప్రతి ఒక్కరూ అవసరమైన సమాచారాన్ని అందిస్తూ అధికారులకు పూర్తి సహకారం అందించేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్‌ కృష్ణయ్య, డీఆర్వో స్రవంతి, సూపరింటెండెంట్‌ నలంద ప్రియ, మాస్టర్‌ ట్రెయినర్లు వెంకటరమణ, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>