కలం, వనపర్తి: జిల్లాలో చేపడుతున్న భూ రీసర్వే పనులను పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ (Vinod Kumar) అధికారులను ఆదేశించారు. శుక్రవారం గోపాల్పేట మండలం చెన్నూరు గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే పనులను ఆయన పరిశీలించారు. భూముల సరిహద్దుల గుర్తింపు, వివరాల నమోదు, రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పనులు చేపట్టాలని సర్వే సిబ్బందికి సూచించారు.
వసతి గృహంలో భోజనం
కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. హాస్టల్ గదులు, వంటగది, మౌలిక వసతులను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, మెనూ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. వసతి గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చేతులు కడుక్కునే ప్రాంతంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వార్డెన్, సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.
నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి
అనంతరం ఎంజేపీటీబీసీ వ్యవసాయ డిగ్రీ కళాశాలను సందర్శించిన వినోద్ కుమార్.. విద్యాబోధన, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారి విద్యా ప్రణాళికలు, పరీక్షలకు సన్నద్ధత, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. వసతి గృహాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఈ పర్యటనల్లో రెవెన్యూ, సర్వే అధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

