కలం, దుబ్బాక: ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందకపోవడం బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) అన్నారు. మల్లన్నసాగర్‌ను (Mallanna Sagar) పూర్తిగా నింపి, కూడవెల్లి వాగులో నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించి రైతుల పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబ్బాక మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే హాజరై వివిధ శాఖల పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వనరులను పొదుపుగా వినియోగించాలని, మిషన్ భగీరథ తాగునీరు వృథా కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామ కార్యదర్శులు నీటి సరఫరాను పర్యవేక్షిస్తూ లీకేజీలను అరికట్టాలని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. నీటి సంరక్షణ, వృథా నివారణపై సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. రైతులకు సాగునీరు అందించడంతో పాటు ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

